కొలువుల బండి : రైల్వేలో 1.3 లక్షల ఉద్యోగాలు

ఢిల్లీ : రైలు బండి వచ్చేసింది. కొలువుల జాతరను తెచ్చేసింది. దేశవ్యాప్తంగా రైల్వే జోన్ల పరిధిలో 1.3 లక్షల ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ), రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (ఆర్‌ఆర్‌సీ) ఈ ఖాళీలను భర్తీ చేయనున్నాయి. వీటిలో 30 వేల ఖాళీలు నాన్ టెక్నికల్ పోస్టులు (ఎన్టీపీసీ), పారామెడికల్ స్టాఫ్, మినిస్టీరియల్ విభాగాలకు సంబంధించినవి కాగా.. మిగిలిన లక్ష ఉద్యోగాలు లెవల్-1 పరిధిలోని పోస్టులు ఉన్నాయి. ఆయా డిపార్ట్ మెంట్లలలో పోస్టుల ఆధారంగా విద్యార్హతలను అధికారులు నిర్ణయించారు. ఆయా పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి వివరాలతో విడివిడిగా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.

నాన్ టెక్నికల్ పోస్టులకు ఫిబ్రవరి 28 నుంచి
పారామెడికల్ స్టాఫ్ పోస్టులకు మార్చి 4 నుంచి
మినిస్టీరియల్ పోస్టులకు 8 నుంచి
లెవల్-1 పోస్టులకు మార్చి 12 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభకానుంది.


మొత్తం ఖాళీలు: 1.3 లక్షలు
నాన్‌-టెక్నిక‌ల్ పాపుల‌ర్ కేట‌గిరీ (ఎన్టీపీసీ)...
జూనియ‌ర్ క్లర్క్ కమ్ టైపిస్ట్‌
అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్‌
ట్రెయిన్ క్లర్క్‌
క‌మ‌ర్షియ‌ల్ కమ్ టికెట్ క్లర్క్‌
ట్రాఫిక్ అసిస్టెంట్‌
గూడ్స్ గార్డ్‌
సీనియర్ క‌మ‌ర్షియ‌ల్ కమ్ టికెట్ క్లర్క్‌
సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్
జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్
కమర్షియల్ అప్రెంటిస్
స్టేష‌న్ మాస్టర్ త‌దిత‌ర పోస్టులు
పారా మెడిక‌ల్ స్టాఫ్‌..
స్టాఫ్ న‌ర్స్‌
హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్
ఫార్మసిస్ట్‌
ఈసీజీ టెక్నీషియ‌న్‌
ల్యాబ్ అసిస్టెంట్‌
ల్యాబ్ సూప‌రింటెండెంట్ తదితర పోస్టులు
మినిస్టీరియ‌ల్ అండ్ ఐసోలేటెడ్ కేట‌గిరీ..
స్టెనోగ్రాఫ‌ర్‌
చీఫ్ లా అసిస్టెంట్‌
జూనియ‌ర్ ట్రాన్స్‌లేట‌ర్ (హిందీ) తదితర పోస్టులు

లెవ‌ల్-1 పోస్టులు..
ట్రాక్ మెయింటైన‌ర్‌ (గ్రేడ్-4)
హెల్పర్/అసిస్టెంట్ (టెక్నికల్)
గేట్‌మ్యాన్‌
అసిస్టెంట్ పాయింట్స్‌మ్యాన్‌ తదితర పోస్టులు

లండన్ బయలుదేరిన జగన్ దంపతులు..

వైసీపీ అధినేత, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దంపతులు చిన్న కుమార్తె వర్షారెడ్డితో కలిసి మంగళవారం రాత్రి లండన్ బయలుదేరి వెళ్లారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుతున్న తన పెద్ద కూతురు హర్షారెడ్డిని చూసేందుకు వెళ్లిన జగన్ దంపతులు అక్కడే ఆరు రోజులు గడపనున్నారు. తిరిగి ఈ నెల 26న లండన్ నుంచి తిరుగు పయనం కానున్నారు. నిజానికి జగన్ గత నెలలోనే లండన్ వెళ్లాల్సి ఉంది. అయితే, ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవడంతో ఆయన పర్యటన వాయిదా పడింది. కాగా తన కుమార్తెను కలిసేందుకు బ్రిటన్ వెళ్ళడానికి అనుమతించాల్సిందిగా కోరుతూ జగన్ పెట్టుకున్న పిటిషన్‌ను పరిశీలించిన సీబీఐ కోర్టు కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. దీంతో జగన్ తన కుటుంబసభ్యులతో కలిసి లండన్ వెళ్లారు.

అమర వీరుడికి ‘ఐ లవ్యూ’.. ముద్దుపెట్టి సాగనంపిన భార్య

డెహ్రాడూన్: ఈ దృశ్యం చూస్తే మనసు ద్రవించిపోతుంది. హృదయం తరుక్కుపోతుంది. కన్నీళ్లు జలజలా రాలుతాయి. పుల్వామా ఉగ్రదాడిలో అమరుడైన మేజర్‌ను అతడి భార్య ప్రేమగా ముద్దిచ్చి సాగనంపింది. బద్దలవుతున్న గుండెను అదిమిపట్టుకుని చివరిసారి ‘ఐ లవ్యూ’ చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ దృశ్యం చూసిన వారు దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు. వలవలా ఏడ్చేశారు. డెహ్రాడూన్‌లో జరిగిందీ ఘటన.

సోమవారం పుల్వామాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మేజర్ విభూతి శంకర్ డౌండియాల్ అమరుడయ్యాడు. మంగళవారం ఆయన పార్థివదేహం స్వగ్రామం చేరుకుంది. దేశం కోసం ప్రాణాలర్పించిన భర్తను చూసిన భార్య నికిత కౌల్ గర్వపడ్డారు. అయితే, గుండె లోపలి నుంచి పొంగుకొస్తున్న కన్నీటిని ఆపుకోలేకపోయారు. అయినప్పటికీ బాధను దిగమింగుకుని నివాళులు అర్పించారు. భర్త పార్థివదేహం పక్కన కూర్చుని చివరిసారిగా తనివితీరా చూసుకున్నారు. ముద్దిచ్చి, ఐలవ్యూ అంటూ కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ ఘటనను చూసిన వారి హృదయాలు ద్రవించిపోయాయి.

నికిత కౌల్ (27)- డౌండియాల్ (34) వివాహం గతేడాది ఏప్రిల్‌లో జరిగింది. తొలి వివాహ వార్షికోత్సవాన్ని ఇంటి వద్దే ఘనంగా జరుపుకోవాలనుకున్నారు. పెళ్లి రోజు నాటికి ఇంటికి వస్తానని భార్యకు చెప్పాడు. వెడ్డింగ్ డే సందర్భంగా పెళ్లి ఫొటోలతో వారి గదిని అలంకరించాలని అనుకున్నామని, కానీ ఇప్పుడు ఒక్క ఫొటోనే గోడకు తగిలించాల్సి వస్తోందంటూ డౌండియాల్ సోదరి వైష్ణవి కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా, మేజర్‌కు చివరిసారి నివాళులు అర్పించేందుకు వేలాదిమంది తరలివచ్చారు. ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ తదితరులు డౌండియాల్‌కు నివాళులర్పించారు.

పాకిస్థాన్ ముర్దాబాద్.. రూ.1100కే మూడు జతల షూలు!

బిజినెస్ అంటే మామూలు విషయం కాదు. కొన్నిసార్లు, వివిధ సందర్భాలను కూడా తమకు అనుకూలంగా మలుచుకుంటేనే వ్యాపారాలు నడుస్తాయి. ఈ విషయాన్ని బాగా ఒంటపట్టించుకున్న ఓ వ్యాపారి.. పుల్వామా దాడిపై నెలకొన్న ప్రజాగ్రహాన్ని తన వ్యాపారానికి వాడుకునే ప్రయత్నం చేశాడు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు పాక్ వ్యతిరేకంగా ‘పాకిస్థాన్ ముర్దాబాద్’ అంటూ నినాదించాడు.

ఇటీవల ఓ పుణె వ్యాపారి పాకిస్థాన్ జెండా కొంటే లైటర్ ఫ్రీ అంటూ తన బిజినెస్ స్కిల్స్ చూపించాడు. అతను అనుకున్నట్లే.. జనాలు పాకిస్థాన్ జెండాలను కొని, లైటర్‌తో తగలబెట్టారు. తాజాగా ఢిల్లీలోని ఓ చెప్పుల విక్రేత కూడా దాదాపు ఇదే ఫార్ములా ఉపయోగించాడు. ‘‘పాకిస్థాన్ ముర్దాబాద్ (పాకిస్థాన్ నశించాలి).. రూ.1100కే మూడు జతల షూలు’’ అని అరవడం కనిపించింది. దీంతో అటుగా వెళ్తున్నవారు వీడియో తీశారు. ఢిల్లీకి చెందిన ఉర్దూ కవి ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి ఈ వీడియోను ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.

కూల్చిన వాళ్లతోనే కట్టించారు.. ‘హంపీ’ ఆకతాయిలకు కోర్టు ఝలక్!

కర్ణాటకలోని హంపీలో గల పురాతన ఆలయం మండపంలో గల స్తంభాలను కొందరు ఆకతాయిలు ధ్వంసం చేశారు. ఈ చర్యకు పాల్పడిన నిందితులకు కర్ణాటకలోని హోస్పేట్ కోర్టు దిమ్మతిరిగే శిక్ష విధించి. రూ.70 వేలు జరిమానాతోపాటు, టన్నుల కొద్ది బరువుండే ఆ స్తంభాలను పునఃప్రతిష్ఠించిన తర్వాతే వారిని విడుదల చేయాలని తెలిపింది. దీంతో పోలీసులు, అధికారులు కోర్టు ఆదేశాలను అమలు చేశాారు.

ఏం జరిగింది?:
మధ్యప్రదేశ్‌కు చెందిన ఆయుష్, రాజా బాబు చౌదరీ, రాజ్ ఆర్యన్, బీహార్‌కు చెందిన రాజేష్ కుమార్ చౌదరీలు కర్ణాటకలోని చారిత్రక ప్రాంతం హంపీని సందర్శించారు. ఈ సందర్భంగా విష్ణు ఆలయ మండపంలోని స్తంభాలను పెకిళించి ధ్వంసం చేశారు. నిందితుల్లో ఒకడైన ఆయుష్.. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి నిందితుల కోసం గాలించారు. వారం రోజుల వ్యవధిలోనే బెంగళూరు, హైదరాబాద్, మధ్యప్రదేశ్‌లలో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ఫిబ్రవరి 8న అరెస్టయిన నలుగురు 13 వరకు పోలీసుల కస్టడీలో ఉన్నారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గీతా మిర్జాకర్ మాట్లాడుతూ.. ఆర్కియాలజికల్ సర్వే అధికారుల సమక్షంలో నలుగురు నిందితులు.. ధ్వంసం చేసిన ఆ స్తంభాలను మళ్లీ యథాస్థితిలో పెట్టాలని తెలిపారు. ఈ నేపథ్యంలో అధికారులు ఫిబ్రవరి 14న నిందితులను అక్కడికి తీసుకెళ్లి కూల్చిన చోటనే గొయ్యి తవ్వించి.. ఆ స్తంభాలను తిరిగి ప్రతిష్టించారు. ఆ తర్వాత ఆ నలుగురిని విడదల చేశారు. వాస్తవానికి వారు చేసిన నేరానికి కనీసం రెండేళ్ల జైలు శిక్ష లేదా రూ.లక్ష జరిమానా విధించాల్సి ఉంటుందని గీతా తెలిపారు. అయితే, న్యాయమూర్తి రూ.70 వేలు జరిమానా విధించి, స్తంభాలను పున:ప్రతిష్ఠ చేసిన తర్వాత విడుదల చేయాలని తెలిపారన్నారు. ఏదైనా ధ్వంసం చేయడం సులభమే. కానీ, తిరిగి కట్టమే కష్టం. నిందితులకు కోర్టు మంచి శిక్షే విధించింది కదూ!!
వీడియో:

తప్పు చేయలేదు.. ఎలాంటి శిక్షకైనా రెడీ: చిన్మయి లైంగిక వేధింపుల ఆరోపణలపై సింగర్ కార్తీక్!

సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులను వెలుగులోకి తీసుకురావడానికి ప్రారంభించిన మీ టూ ఉద్యమం కొద్ది నెలల క్రితం తమిళ పరిశ్రమను కుదిపేసిన విషయం తెలిసిందే. ఇలాంటి ఉద్యమంలో సింగర్ కార్తీక్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది. తనపై ఆరోపణలు వచ్చిన తర్వాత ఐదు నెలలకు సింగర్ కార్తీక్ వివరణ ఇచ్చారు. నా చుట్టు ఉండే వ్యక్తులను వేధించే మనస్తత్వం నాది కాదు అని పేర్కొన్నారు. గాయని చిన్మయి చేసిన ఆరోపణలకు సమాధానమిస్తూ ఇంకా ఏమన్నారంటే..

నాపై వచ్చిన ఆరోపణలు రుజువైతే నేను ఎలాంటి శిక్షకైనా సిద్ధమే. మీ టూ ఉద్యమానికి నేను ఎప్పుడూ సహకారం అందిస్తాను. నాపై ఎవరో తెలియని వ్యక్తి లైంగిక ఆరోపణలు చేయడం బాధ కలిగింది. వాస్తవమేమిటో నా ఆత్మకు తెలుసు అని కార్తీక్ ఆవేదన వ్యక్తం చేశాడు.

నా చుట్టూ ఉండే వ్యక్తులు గానీ, నాకు పరిచయం ఉన్న వాళ్ల మనోభావాలకు వ్యతిరేకంగా నేను ఎన్నడూ బాధపెట్టలేదు. అంతేకాకుండా నాకు తెలిసి ఎవర్నైనా నొప్పించిన దాఖలాలు కూడా లేవు. నాతో ఉండే వారు ఎన్నడూ అభద్రతాభావంతో కూడా బాధ పడిన పరిస్థితులు లేవు అని కార్తీక్ లేఖలో పేర్కొన్నారు.

నా తీరు, ప్రవర్తన వల్ల ఎవరైనా బాధపడినట్టు భావిస్తే, నాతో డైరెక్ట్‌గా మాట్లాడండి. ఎవరైనా లైంగిక వేధింపులకు గురైతే నేనే స్వయంగా వారికి అండగా నిలిచి నైతికంగా మద్దతు ప్రకటిస్తాను. నావల్ల ఎవరైనా ఇబ్బందులకు గురైతే వారు విధించే శిక్షకు లేదా క్షమాపణ చెప్పడానికి ఎల్లప్పుడూ నేను సిద్ధమే అని కార్తీక్ పేర్కొన్నారు.

నేను మీ టూ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొన్న సమయంలో నాకు అండగా నిలిచిన నా ఫ్యామిలీ, నా భార్య, అభిమానులకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు సహకారం అందించిన మీడియాకు రుణపడి ఉంటాను. ఇక ముందు వివాదాలకు తావులేని లైఫ్‌ను లీడ్ చేయాలని భావిస్తున్నాను అని కార్తీక్ లేఖలో పేర్కొన్నారు.

ఆ అదృష్టం సావిత్రి తర్వాత విజయ నిర్మలకే దక్కింది.. మహిళలకు మార్గదర్శి, విజయాలకి నాంది మన విజయనిర్మల

కనులతో నటించి, చిరునవ్వుతో అభినయించి, అద్భుతమైన నృత్యంతో అనునయించి, అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నటి తను. తన నటనతో పాత్రలకు జీవం పోశారు.ఒక నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, భార్యగా, తల్లిగానే కాకుండా సమాజానికి ఒక సందేశకురాలు ఆమె. ఎందరికో ఆదర్శప్రాయం ఆమె నటన.. మరెందరికో మార్గదర్శకం ఆమె దర్శకత్వ ప్రతిభ. లెజెండరీ యాక్టర్ శివాజీ గణేశన్ ను డైరక్ట్ చేసే అవకాశం మహిళా దర్శకులలో సావిత్రి గారి తరువాత ఈమెనే వరించింది. తనే విజయనిర్మల.

పేరు మారిన సందర్భం
ఈమె అసలు పేరు నిర్మల. తనకు తొలి అవకాశం ఇచ్చిన విజయా ప్రొడక్షన్ బ్యానర్ పేరునే తన పేరుకు కలుపుకుని విజయనిర్మలగా పిలవబడుతున్నారు, అలానే ప్రసిద్ధి చెందారు. అయితే అప్పటికే నిర్మలమ్మ అనే నటి ఉండటం కూడా తన పేరును మార్చుకోవడానికి ఇది ఒక కారణమైంది.

బాలనటిగా పరిచయమైన వేళ
చిన్నతనంలో ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చిన విజయనిర్మల గారి స్వస్థలం నరసరావుపేట లోని పాతూరు. ఫిబ్రవరి 20, 1946 లో జన్మించారు. బాల్యంలోనే తల్లితండ్రులతో కలసి మద్రాస్ వెళ్లిన విజయనిర్మల 'మచ్చా రేఖై (Machcha Rekhai)' అనే సినిమా ద్వారా బాలనటిగా తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. 'పాండురంగ మహత్యం' సినిమాలో బాలకృష్ణుడి పాత్రలో బాలనటిగా తెలుగుతెరకు పరిచయమయ్యారు.

నటిగా గుర్తింపు
1) 1964 లో 'భార్గవి నిలయం' అనే మలయాళ చిత్రం ద్వారా నటిగా పరిచయమై తన నటనతో మంచి పేరును సంపాదించుకుంది.
2) తెలుగులో 'రంగుల రాట్నం' సినిమాతో.. అలాగే తమిళంలో 'ఎంగవీట్టు పెణ్‌' సినిమాతో నటిగా పరిచయం అయింది.
3) 1967 'సాక్షి' సినిమాతో కృష్ణతో కలసి నటించిన విజయనిర్మల.. కృష్ణ గారితోనే 47 చిత్రాలలో నటించింది. వాటిల్లో 'మోసగాళ్లకు మోసగాడు', 'మంచి కుటుంబం', 'అల్లూరి సీతారామరాజు', 'దేవుడు చేసిన మనుషులు', 'అక్కా చెల్లెళ్లు' వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో విజయ నిర్మల - కృష్ణ జంటగా నటించారు.
4) ఈమె ఇప్పటివరకు తెలుగు, తమిళ, మలయాళ పరిశ్రమలలో 200 చిత్రాలకు పైగా నటించారు.
దర్శకురాలిగా
5) బాపు దర్శకత్వం వహించిన 'సాక్షి' సినిమాతో స్ఫూర్తి పొంది.. తాను కూడా దర్శకురాలిగా మారడానికి ఈ సినిమా ప్రేరేపించింది.
6) తమిళంలో 'కుంగుమాచిమిళ్ (Kungumachimizh)' అనే సినిమాకు దర్శకత్వం వహించగా.. మలయాళంలో ఒకే సినిమాకు దర్శకత్వం వహించింది.
7) తెలుగులో 'మీనా' సినిమాతో మొదలైన ఆమె దర్శకత్వ ప్రతిభ 40 చిత్రాల వరకు తీసుకెళ్లింది. ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన 40 చిత్రాలలో సగానికి పైగా సినిమాల్లో కృష్ణ నటించారు.
నిర్మాతగా
విజయ కృష్ణ బ్యానర్ ను స్థాపించి 15 చిత్రాలను నిర్మించింది.
అవార్డ్స్
అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకులలో ఒకరైన విజయనిర్మల గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నారు. అంతేకాకుండా రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు కూడా ఆమెను వరించింది.
కుటుంబం
విజయనిర్మల మొదటి భర్త (కృష్ణమూర్తి) సంతానమే నరేష్. ఇతను కూడా ప్రస్తుతం చిత్రపరిశ్రమలో నటుడిగా కొనసాగుతున్నాడు. విజయనిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు. సహజనటిగా గుర్తింపు తెచ్చుకున్న జయసుధకు ఈమె వరుసకు అత్త అవుతుంది.

ఆ తరానికి, ఈ తరానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన ప్రతిభావంతురాలు విజయనిర్మల. ఆమె ఇలాగే ఎందరికో ఆదర్శప్రాయంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

అమర జవాన్ల కోసం ఆసీస్‌పై గెలుస్తాం

పుల్వామా దాడిలో అసువులు బాసిన అమర జవాన్ల కోసం ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచి వారికి అంకితమిస్తామని భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ధీమా వ్యక్తం చేశాడు. భారత్ వేదికగా ఆదివారం నుంచి ఆస్ట్రేలియాతో రెండు టీ20లు, ఐదు వన్డేల సుదీర్ఘ సిరీస్‌ను టీమిండియా ఆడనుంది. ఈ నేపథ్యంలో.. ఈరోజు మీడియాతో మాట్లాడిన మహ్మద్ షమీ.. పుల్వామా దాడి గురించి స్పందించాడు. ఈ సందర్భంగా అమర జవాన్ల కుటుంబాలకి షమీ రూ.5 లక్షలు విరాళం ప్రకటించాడు.

‘పుల్వామా దాడి వార్త నన్ను బాధించింది. సరిహద్దుల్లో సైనికులు తమ ప్రాణాలకి తెగించి పహారా కాస్తుండటంతోనే.. మనం ఇంట్లో హాయిగా నిద్రపోగలుగుతున్నాం. ఇప్పుడు 40 మంది జవాన్ల కుటుంబాలు తమ పెద్ద దిక్కుని కోల్పోయాయి. కనీసం వారికి ఆర్థిక సాయం చేయడం ద్వారా అండగా నిలుద్దాం. మన కోసం ప్రాణాలు అర్పించిన వారికి ఆ మాత్రం మద్దతుగా నిలవడం మన బాధ్యత. ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచి అమర జవాన్లకి అంకితమిస్తాం’ అని షమీ వెల్లడించాడు.

బ్రీఫ్డ్ మీ, పప్పు, బయోపిక్‌లపై నాగబాబు స్కిట్.. ఏంది సామి అరాచకం.. మరోసారి జబర్దస్త్ ఆర్టిస్ట్‌లతో టీడీపీపై ఇన్ డైరెక్ట్ ఫన్నీ స్కిట్ వదిలిన నాగబాబు

ఏంటో ఈ మధ్యకాలంలో నాగబాబు వేషాలు ఆయన స్థాయిని దిగజార్చేవిగా ఉంటున్నాయి. ఇటీవల ‘అంతా నా ఇష్టం’ అంటూ సొంతంగా యూట్యూబ్ దుకాణం ఓపెన్ చేసిన తరువాత అధికార ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక జబర్దస్త్ కామెడీ షోతో బాగా పాపులర్ అయిన ఆయన తనతో పాటు జబర్దస్త్ కమెడియన్స్‌ని రంగంలోకి తీసుకువచ్చారు. రైజింగ్ రాజు, దొరబాబులతో స్కిట్‌లు వేయించి మరీ అధికార ప్రతిపక్ష పార్టీలను ఇరుకున పెట్టే హాస్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

82ఏళ్ల తర్వాత కనిపించిన అరుదైన సర్పం

లఖింపూర్‌ ఖేరి: భారతదేశంలోని అరుదైన సర్ప జాతుల్లో ఒకటి రెడ్‌ కోరల్‌ కుక్రి. దాదాపు 82ఏళ్ల తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌లోని దుద్వా టైగర్‌ రిజర్వ్‌(డీటీఆర్‌)లో అధికారులు గుర్తించారు. సోమవారం రాత్రి ఈ అరుదైన సర్పం కనిపించినట్లు తెలిపారు. దుద్వాలోనే తొలిసారి ఈ సర్పం 1936లో కనిపించింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత దర్శనమివ్వడం విశేషం. దీనిని జంతుశాస్త్ర పరిభాషలో ‘ఆయిల్‌గోడాన్‌ ఖేరిన్‌సిస్‌’గా వ్యవహరిస్తారు. ఖేరి ప్రాంతంలో మనుగడ సాగించడంతో ఈ పేరు వచ్చింది.

‘దాదాపు 82 సంవత్సరాల తర్వాత దుద్వా అటవీ ప్రాంతంలో ఈ అరుదైన సర్పాన్ని గుర్తించాం’ అని డీటీఆర్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌ రమేష్‌ కుమార్‌ పాండే వెల్లడించారు. ‘సోమవారం రాత్రి అటవీ అధికారుల బృందం దక్షిణ సోనారిపూర్‌ రేంజ్‌ అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్‌కు వెళ్లింది. సమీప రైల్వేస్టేషన్‌ వద్ద పట్టాలపై ఒక మీటరు పొడవున్న రెడ్ కోరల్‌ కుక్రిని గుర్తించారు. నారింజ రంగులో మెరిసి పోతూ కనిపించిన ఈ సర్పం గతంలో ఎప్పుడూ చూడలేదు. వెంటనే బృందంలోని ఒకరు దాన్ని ఫొటో తీశారు’ అని రమేష్‌ తెలిపారు. సర్పం వివరాల గురించి శోధించగా దాన్ని రెడ్‌ కోరల్‌ కుక్రిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. 2004లో ఇటువంటి సర్పాన్నే కతర్నియాఘాట్‌ వైల్డ్‌ లైఫ్‌ శాంక్చరీలో తాను చూసినట్లు పాండే తెలిపారు.

డీటీఆర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ మహవీర్‌ మాట్లాడుతూ.. ‘కతర్నియాఘాట్‌ అటవీ ప్రాంతంలో ఏడేళ్ల కిందట కనిపించిన రెడ్‌ కోరల్‌ కుక్రి ఇప్పుడు దుద్వా అటవీ ప్రాంతంలో కనిపించడం అద్భుతం’ అన్నారు. రెడ్‌ కోరల్‌ కుక్రి ఎక్కువగా రాతి ప్రదేశాల్లో కనిపిస్తుంది. ఇది విష సర్పం కాదు. పురుగులను, కీటకాలను తిని బతుకుతుంది. ఎరుపు, నారింజ రంగుల్లో ఉంటుంది. నేపాల్‌లోనూ ఈ జాతి సర్పాలు ఎక్కువగా ఉంటాయి.

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)